స్వామి వివేకానందుని పుట్టినరోజు సందర్బముగా ఆ మహానుభావుని కి నివాళులర్పిస్తున్నాను. వివేకానందుల జీవితంలో భగవంతుడు చూపిన కొన్ని లీలలను చూస్తే భగవంతుడు తన భక్తుల కొరకు ఎంత తపిస్తాడో చూడగలం.
"అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం"
ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ప్రతిజ్ఞ.
ఇది ఎంతమాత్రం నిజమో పరీక్షిద్దామని స్వామి వివేకానందుడు అనుకొన్నాడు.
ఏమీ తినకుండా ఒక అడవిలో ప్రయాణించసాగాడు. ఒక రోజంతా ఉపవాసంలోనే ఉన్నాడు. ఐనా ఏమీ తినలేదు. ఉన్నట్టుండి వెనుక నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. ఒకతను ఒక మూటలో ఆహారపదార్థాలు ఉంచుకొని వస్తూ "స్వామీ ఆగండి, మీ కోసం ఆహారం తీసుకొని వస్తున్నాను" అన్నాడు. ఐనా వివేకానందుడు వినిపించుకోకుండా పరుగెత్తసాగాడు. వెనుక పిలుస్తున్న వ్యక్తి కూడా ఒక కిలోమీటర్ దూరం వెనుక పరుగెత్తి స్వామిని పట్టుకొని తినమని నిర్బంధించడంతో స్వామి వివేకానందులు ఆనందభాష్పాలతో తిన్నారు.
నరునకు గల మానవతా లక్షణములలో "కృతజ్ఞత" ప్రధానమైనది.కృతజ్ఞత అనగా మనకు మంచి చేసిన వారిని మరిచిపోకుండా వారికి తిరిగి ప్రత్యుపకారం చేయుట.అలా చేయకపోవడాన్ని "కృతఘ్నత" అంటారు.రామాయణం లో రాముడు వాలిని చంపి సుగ్రీవునికి సహాయం చేశాడు.కాని సుగ్రీవుడు అది మరిచి తన పనులలో మునిగిపోయాడు.అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవునితో
"బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః!!"
భావము: బ్రహ్మ హత్యకు,సురాపానమునకు,వ్రతభంగమునకు,దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది.కాని కృతఘ్నతకు లేదు.
కృతఘ్నుల మాంసము కుక్కలు సైతం తినవు.కాబట్టి కృతజ్ఞత చూపడం ముఖ్యం.
ఈ లీల కూడా బాల కృష్ణుడి లీలే. మరి చదవండి.
బాల కృష్ణుడిని ఎలాగైనా దొంగతనం చేయకుండా ఆపాలని ఒక గోపిక చాలా ఎత్తులో వెన్న పెట్టిన కుండలు పెట్టింది. వచ్చినా కనుగొనాలని ఆ కుండలకు గంటలు కట్టింది. తన పనులు చూసుకోసాగింది. కృష్ణుడు రానే వచ్చాడు.
అంత ఎత్తులో ఉన్న కుండలను చూసాడు. రోల్లు, గిన్నెలు బోర్లించి పైకి ఎక్కాడు. కట్టబడి ఉన్న గంటలను చూసి మోగవద్దని వాటిని ఆదేశించాడు.
అప్పుడు వెన్నను తీసుకొని మొదట స్నేహితులకు పెట్టాడు. గంటలు కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం మోగలేదు. అందరికి ఇచ్చిన తర్వాత తను కొద్దిగా తీసుకొని నోటిలో పెట్టుకున్నాడో లేదో గంటలు మ్రోగాయి.
శ్రీకృష్ణుడు వెంటనే "మోగవద్దని చెప్పాను గదా! మళ్ళీ ఎందుకు మ్రోగారు?" అని అడిగాడు. అప్పుడు ఆ గంటలు చెప్పాయి " ఏం చెప్పము స్వామీ ! తరతరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు గంటలను మ్రోగిస్తారు కదా. అందుకే నీవు నోటిలో పెట్టుకొనేప్పుడు మ్రోగాము" అన్నాయి.
శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుండి జారుకొన్నాడు.