నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే

భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర అనుకొంటే దగ్గరే అని చెప్తారు కదా!దూరాత్‌ దూరే అంతికే చ'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది.

పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.

అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది.

ఒకనాడు సన్న్యాసి ఒక రావిచెట్టు క్రింద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు వినాయకుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది.

చెట్టుక్రింద ఉన్న విగ్రహం కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ విగ్రహం పై కాలెత్తి అది చేసే పని అది చేసింది. ఆ విగ్రహం కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లువేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది. ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ.

''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది వేదం.


తననే నమ్ముకొన్న , తన కోసమే బ్రతికే వారికి భగవంతుడు ఎలా సహాయం చేస్తాడో తెల్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని తెల్సుకొన్నా ఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తాయి.

ఈ టపాలో భగవాన్ రమణమహర్షుల జీవితంలో ఆయనకు భగవంతుడు ఎలా దారి చూపాడో చూద్దామా!

రమణులు అరుణాచలం పోవాలని నిర్ణయించుకొన్నారు. డబ్బు సమస్యను మహర్షుల అన్నగారి రూపంలో తీర్చాడు.

తర్వాత రైలులో అరుణాచలం మార్గానికి చుట్టు మార్గంలో పోతుంటే ఒక ముస్లిం ద్వారా అసలు మార్గానికి మళ్ళించాడు. తర్వాత ఆ ముస్లిం కనిపించలేదు.

ఆహారం లేక అలమటిస్తుంటే మొదట ఒక గుడిలో పూజారి ఇవ్వకున్నా మేళం వాయించే వ్యక్తి రూపంలో తీర్చాడు. తర్వాత ఒక ఆవిడ దేవుడికి నైవేద్యానికని తయారుచేసిన ఆహారాన్ని మొదట రమణులకే పెట్టి ఇంకొంత ఆహారాన్ని ఒక మూటలో కట్టి పంపింది.

చివరికి అరుణాచలం వెళ్ళిన తర్వాత వేళకానివేళలో గుడి మూసిఉండాల్సిన వేళలో గుడి తలుపులు తెరిచిఉండి రమణులు ఒక్కరే లోనికి వెళ్ళి "అప్పా! నీ ఆజ్ఞ ప్రకారం నీ వద్దకు వచ్చేసాను"అంటూ అరుణాచలఅగ్నిశివలింగాన్ని కౌగిలించుకొని ఆనందభాష్పాలు రాల్చారు రమణులు.

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాను.


భక్తపోతన గురిచి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహాభక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత సంఘటన చూద్దామా!

పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు.

ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వెసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు. వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు.

ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు. కాని రాజు ఆలోచించాడు. అంత పెద్ద పందిని,అది కూడా తెల్లని భారీపంది భూమిపై ఎక్కడా ఉండదు కదా , బహుశా అదీ ఏ మాయో అనుకొన్నాడు. పోతనను రక్షించేందుకు వచ్చిందేమో అనుకొన్నాడు.

పశ్చాత్తాపంతో మళ్ళీ పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ పంది లేదు. ఇంటి లోనికి వెళ్ళి పోతనను పలకరించాడు.

పోతన గారు రాజును ఆహ్వానించగా, రాజు జరిగిన విషయం చెప్పాడు. అది విని పోతన కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే పంది యొక్క కాలిముద్రలను చూసి ఆ పాదదూళిని తన తలపై వేసుకొన్నాడు.
తర్వాత ఒక అత్యద్భుత విషయాన్ని చెప్పాడు. ఆ పందిని రాజు బయట చూసిన సమయంలో పోతన గారు "యజ్ఞ (ఆది) వరాహ మూర్తి" అవతారఘట్టాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నాడు. ఆ వరాహమూర్తే పోతనను కాపాడాడు.



ఇప్పుడు చెప్పబోయే విషయం గమనిస్తే నేటి మనుషులు ఆశ్చర్యపోక తప్పదు.

లంకలో సీతమ్మను కలుసుకొన్న తర్వాత సీతమ్మ " హనుమా! నీవు ఎంత బలవంతుడివి. ఇంత సముద్రాన్ని దాటి నువ్వొక్కడివే దాటగలిగావు" అంది. ఇలాంటి మాటే గనుక నేటి పిల్లలతో కానీ, పోటీలలో పాల్గొని కొద్దిగా బాగా ప్రదర్శన ఇచ్చిన పోటీదారుతో కాని అంటే ఉద్రేకంతో ఎంతగా అరుస్తారో,ఎంత అహంకరిస్తారో టీవీ లలో మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇక్కడ హనుమంతుడు చూపిన వినయం చూస్తే నేటి సమాజం ఆశ్చర్యపోక మానదు.

హనుమంతుడన్నాడు, " అమ్మా! మా సైన్యంలో నాతో సమానమైన బలవంతులూ, నా కన్నా అధికులూ ఐన వారు ఉన్నారు. అంతేకాని నాకన్నా తక్కువ వారు లేరు. ఒక ఇంట్లో ఆడవారికి ఏదైనా కబురు చేయడానికి ఒక పిల్లవాడినో, ఇంట్లో అందరికన్నా తక్కువ వారినో పంపిస్తారు. అంతేకాని పెద్దవారు రారు కదా !".

హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు. ఎవరూ రాలేకనే కదా హనుమంతున్ని పంపింది. కాని హనుమంతుని వినయం ఎంతగా ఉందో చూసారా? కనీసం అలాంటి వినయాన్ని ఊహించగలమా?
ఇప్పుడు చెప్పండి నేటి యువత కానీ, సమాజం కానీ, చదువుకొన్న,చదువుకుంటున్న విద్యార్థులు కానీ ఎంత వినయం నేర్చుకోవాలో.