నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే



ఈ లీల కూడా బాల కృష్ణుడిదే.


శ్రీకృష్ణుడు పుట్టిన తొలినాళ్ళవి. ఒక వృద్ధగోపిక బాల కృష్ణుడిని కాళ్ళపై పడుకోబెట్టుకొని ఒళ్ళంతా నూనె పూసి, చేతులకు పసుపు పూసి తలంటి స్నానం చేయించింది. తర్వాత బాల కృష్ణుడిని పడుకోబెట్టడానికి జో కొట్టడం ప్రారంభించారు. భగవంతుడు నిద్రపోడు కదా అందుకని కృష్ణుడు నిద్రపోవడం లేదు. పిల్లాడు ఎంతకూ నిద్రపోవడం లేదని కృష్ణుడిని బోర్లాపడుకోబెట్టి గట్టిగా జో కొట్టడం ప్రారంభించారు.


"అయ్యో! మందర పర్వతాన్ని (కూర్మావతారంలో) మోసినప్పుడు కూడా ఇంత నొప్పి కలుగలేదు. వీళ్ళెందుకు నా వీపుపై ఇంతగా కొడుతున్నారు? ఓహో! భూమిపై పుట్టినప్పుడు నిద్రపోవాలి కదా! సరే నేను నిద్రపోతాను. అప్పుడు కొట్టడం ఆపుతారు" అనుకొని నిద్రపోతున్నట్లు నటించాడు. అప్పుడు జో కొట్టడం ఆపివేసారు.


చూసారా భగవంతుడు భక్తులకోసం ఎంత చేస్తాడో.


ఆది శంకరాచార్యుల శిష్యుడైన పద్మపాదుని జీవితములో జరిగిన ఒకసంఘటన.
పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది దాని జపం కోసంఅహోబిల క్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చొన్నారు. ఒకఎరుకవాడు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారని తాను ఏదైనాచేయగలది ఉందాయని
పరామర్శించాడు. తాను నరసింహాన్నిఅన్వేషిస్తూ, ఆవనము లోనికి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టిమృగం లేదని ఎరుకవాడు అన్నాడు. ఉందని పద్మపాదులు అన్నాడు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఎరుకవాడికి చెప్పాడు.

అంతటితో ఎరుకవాడు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజుసూర్యాస్తమయంలోగా తాను మృగాన్ని తెచ్చి పద్మపాదులముందునిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికిప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు.

అంతటితో నరసింహుడు ఎరుకవానికి ప్రత్యక్షమౌతాడు.

తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఎరుకుధ్యానంరెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకాజపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో (అంటే కనబడకుండా తాను శబ్దం మాత్రం చేస్తూ తనఉనికిని చెప్పడం) మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. అవసరమైనప్పుడు ఇంకోసారి తన ఆవేశంలో లోకోత్తరమైనఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు.

శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో నరసింహస్వామిపద్మపాదుడిని పూని కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారు.

ఎరుకువానికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. విశ్వాసంతో తానుచూడని నరసింహాన్నివర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. అన్వేషణలోరాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే.

నరసింహము ఉన్నదని విశ్వసించాడు. సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్యేయమైంది.. దానికోసంతన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి
భగవద్దర్శనం కల్గింది


దయచేసి క్రింద వ్రాశిన కృష్ణలీలను చదివేటప్పుడు మీ పిల్లాడినో,పాపనో లేక బాల కృష్ణుడినో ఊహించుకొని చదవండి.

మొదటిసారి అమ్మ యశోద బాల శ్రీకృష్ణుడికి కాలి గజ్జెలు వేసింది. కృష్ణుడు గజ్జెలు వేసుకొని పాకడం మొదలుపెట్టాడు. వెనుక ఏదో శబ్దం వచ్చింది. వెనుకకు తిరిగి చూసాడు. అమ్మ యశోద దూరంగా నిలబడి చూస్తోంది. మళ్ళీ పాకడం మొదలు పెట్టాడు. పాకుతున్నకొద్దీ శబ్దం వస్తూనే ఉంది. కృష్ణుడు బిక్కమొహం వేసుకొని వెనుకకు చూస్తే అమ్మ నవ్వుతూ దూరం నుండి చూస్తోనే ఉంది.

కృష్ణుడు అమ్మ వైపు చూస్తూ భయంతో మొహం పెట్టుకొని అమ్మ వైపు చూస్తూ ఏడుస్తున్నాడు. యశోద నవ్వుతూ పరుగెత్తుకుంటూ వచ్చి "కన్నయ్యా ! ఆ శబ్దం నీ కాలి గజ్జెలవిరా. వెనుక ఎవరూ రావడం లేదు" అంటూ వదిలింది. మాళ్ళీ పాకడం మొదలెట్టేసరికి మళ్ళీ గజ్జెల శబ్దం వచ్చింది.ఏడుస్తూ ఇంకా వేగంగా పాకుతూ అమ్మ వద్దకు రావడంతో తను వేసుకొన్న కాలిగొలుసులు ఇంకా శబ్దం రావడంతో అమ్మ వద్దకు వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని ఏడ్వసాగాడు.

ఈ చేష్టను చూసి యశోద నవ్వుతూ కృష్ణుడిని ముద్దాడుతూ "ఇంత చిన్న విషయానికే భయపడితే పెద్దయ్యాక ఎలా బ్రతుకుతావురా?" అంది.
బాగుంది కదండీ కృష్ణుడి లీల.


నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః

సహస్రకోటి యుగధారిణే నమః ఓం నమ ఇతి



అర్ధనారీశ్వరతత్వం విషయం మనకు తెలుసు. శివుడు,పార్వతీమాత సగంసగం శరీరం కలిగి ఉంటారని మనకు తెలుసు. అలానే హరిహరమూర్తి తత్వం కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు.


దీని గురించి వివరాలు చూద్దామా.


శ్రీమహావిష్ణువుకు పద్మనయనుడు అనే పేరు ఉంది కదా. ఒకసారి శ్రీహరి పరమశివుడిని వెయ్యి(సహస్ర) తామరపూవులతో పూజించాలని అనుకొన్నాడు. అందుకోసం ఒక వెయ్యి పూవులను సిద్దం చేసుకొని పూజ మొదలుపెట్టాడు. ఇంతలో శివుడు ఒక పుష్పాన్ని మాయం చేసాడు. 999 పూవులు పూజ ఐన తర్వాత ఒక పుష్పం తగ్గిన విషయం చూసిన హరి పూజ నుండి పైకి లేవడం ఇష్టం లేక, తన కళ్ళను పద్మాలు అంటారనే విషయం గుర్తుకు వచ్చి, తన ఒక కన్నునే తామరపూవుగా పెకిలించి పూజ చేసాడు.


విష్ణువు భక్తిని చూసి ముగ్దుడైన పరమశివుడు ఎంతో సంతోషం పొంది సుదర్శన చక్రాన్ని, అలానే తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు. తర్వాతి కాలంలో పార్వతీదేవికి కూడా తన శరీరంలో సగభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు.


శ్రీ ఆదిశంకరాచార్యులు వ్రాశిన శివానందలహరి లో ఒక శ్లోకంలో ఆదిశంకరులు పరమశివుడిని ఎలా స్తోత్రం చేసారో చూస్తే భక్తుడికి,భగవంతుడికి మధ్య ఎంత చనువు ఉంటుందో అర్థం అవుతుంది.


ఆదిశంకరులు ఒక శ్లోకంలో


"శంకరా! మీ ఇంటికి నేను వస్తే ఏదో భక్తుడు వచ్చాడు కదా అంటూ తాగడానికి ఏమీ ఇవ్వకు. ఎందుకంటే నీవు తాగేది హాలాహలం కదా. సరే బట్టలు పెడదామనుకొనేవు, మీరు కట్టుకొనేదే ఏనుగు చర్మము. కనీసం ఏదైనా వాహనం ఇస్తాను అనుకొనేవు,నీవు వాడేదే ముసలి ఎద్దు.అది నన్ను కూడా ఎలా మోస్తుంది. నీవు ఏమీ ఇవ్వనవసరం లేదు. నీ పాదపద్మాలపై భక్తిని మాత్రం ప్రసాదించు.చాలు".


శ్లోకార్థం వివరణ ఇది.

చూసారా భగవంతుడితో భక్తుడు ఎంత చనువుగా మాట్లాడతాడో,ఉంటాడో.


శీర్షిక చూసి ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా. నిజమే ఈ మాటలన్నది శ్రీరాముడే. ఈ విషయం రామాయణం చదివిన చాలామందికి తెలుసు. అలానే చాలామందికి తెలియదు.

నాకు తెలుసు అన్న భావంతో చెప్పడం లేదు. రాముడికి లక్ష్మణుడిపై ఉన్న అభిమానం ఎంతో అలానే సంసారంలో సంబంధ,బాంధవ్యాలు ఎలా ఉండాలో రాముడు మనకు ఎలా చెబుతున్నాడో ,అందరికీ తెలియజేయాలనే భావంతో వ్రాస్తున్నాను.

ఇక విషయానికి వస్తున్నాను.

రాముడు అరణ్యవాసం చెస్తున్న తొలిదినాలవి. ఒకరోజు భరతుడు పరివారంతో కలిసి రాముడి వద్దకు వచ్చి దశరథుని మరణవార్త చెప్పాడు. వెంటనే రాముడు కన్నీరు కారుస్తూ సీతతో "సీతా! మీ మామయ్య మరణించాడు" అని లక్ష్మణునితో "లక్ష్మణా! మీ నాన్న మరణించాడు" అని అన్నాడు.

ఇక్కడే మనకొక అనుమానం వస్తుంది. రాముడేంటి అలా చెప్పాడు? దశరథుడు రాముడికి కూడా తండ్రే కదా! మన నాన్నగారు మరణించారని చెప్పవచ్చు కదా? అని.

ఇక్కడే రహస్యం ఉంది. రాముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమే కదా. కాబట్టి రాముడు చెప్పినదానిలో అర్థం, రాముడే ఇంకోచోట చెప్పాడు.

"ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అన్న. కాని నేను లక్ష్మణుడిని అలా చూడలేదు. లక్ష్మణుడే తనకు అవసరం లేకున్నా నాతోపాటు వనవాసానికి వచ్చి నన్నే ఒక కొడుకును తండ్రి చూసుకుంటున్నట్లు చూసుకుంటూ నన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి లక్ష్మణుడు నాకు తండ్రి లాంటివాడే. కాని లక్ష్మణుడిని చూసుకొనే తండ్రి దశరథుడు మరణించాడు" అని రాముడు అన్నాడు.

ఇప్పుడు అర్థమైంది కదా రాముడు లక్ష్మణుడితో "మీ నాన్న మరణించాడు" అని ఎందుకన్నాడో.

ఇక సీతను ఉద్దేశించి అలా ఎందుకన్నాడో చూద్దాం.

ఒక మామ తన కోడల్ని ఎలా చూసుకోవాలో దశరథుడు అంతకన్నా ఎక్కువగా ఒక కూతురిగా సీతను చూసుకొన్నాడు.
దీనికి ఉదాహరణగా మనం క్రింది సంఘటనను చెప్పవచ్చు.

రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు వనవాసనియమాలు రాముడికి మాత్రమే వర్తిస్తాయని, సీతకు వర్తించవని దశరథుడు అనుకొన్నాడు. అందుకనుగుణంగా వనవాససమయంలో ఒక రోజు కట్టిన చీర మరో రోజు కట్టనవసరం లేకుండా పదునాలుగేళ్ళకు సరిపడా పట్టుచీరలు , నగలు పంపడానికి తెప్పించి పంపబోగా లక్ష్మణుడు వాటిని తీసుకుపోవడానికి సిద్దపడ్డాడు.

ఇప్పుడు చెప్పండి తండ్రి మాత్రమే తన కూతురు మెట్టినింటికి వెళ్తున్నప్పుడు సారె పంపుతాడు కదా. అలాంటిది తన కొడుకుకు లేకున్నా తన కోడలి కోసం పంప ప్రయత్నించిన దశరథుడు ,సీతను కన్నతండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నట్లే కదా. ఇంతటి సంబంధబాంధవ్యాలు ఉండబట్టే "సీతా! మీ మామయ్య చనిపోయాడు" అని రాముడన్నాడు.


ఎన్నని చెప్పగలము బాలకృష్ణుడి లీలలు.


ఇప్పుడు మరో బాల్య లీల చూద్దాం.


ఒకరోజు ఎప్పటిలానే కృష్ణుడు అన్నం తినకుండా అమ్మ యశోద వద్ద మారాం చేస్తున్నాడు. యశోద అందరి అమ్మలలానే "నిన్ను బిచ్చగాడికి ఇచ్చేస్తాను" అంది. ఐనా కృష్ణుడు మారాం మానలేదు.


ఇంతలో నిజంగానే ఒక బిచ్చగాడు భిక్ష కోసం వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే కృష్ణుడు భయపడిపోతూ అమ్మ వద్దకు పరుగెత్తుకెళ్ళి అమ్మ కాళ్ళ మధ్య చీరలో తల పెట్టి " అమ్మా! నన్ను అతనికి ఇచ్చేయద్దు. నేను అన్నం తింటాను" అంటూ ఏడుస్తున్నాడు.అమ్మ యశోద "కిట్టయ్యా! నువ్వు నా బంగారానివి. నిన్ను ఎవరికి ఇస్తాను" అంటూ సముదాయించింది. ఇలా అంటూ ఆ బిచ్చగాడికి భిక్ష వేయడానికి ఇంట్లోకి వెళ్లబోయింది.

కాని కృష్ణుడు అడ్డుపడుతూ "అతనికి నన్ను ఇవ్వవద్దు" అంటూ అంటున్నాడు. యశోద కృష్ణుడిని ఎత్తుకొని ఆ బిచ్చగాడికి ఆహారం వేసింది. అంతసేపూ కృష్ణుడు అమ్మ భుజం పై తల పెట్టుకొని కళ్ళు మూసుకొనే ఉన్నాడు.తర్వాత అన్నం తిని, పాలు త్రాగి పడుకొన్నాడు. కాని రాత్రంతా ఆ బిచ్చగాడు వస్తాడేమోనని బయటకు చూస్తూనే ఉన్నాడు.


తరవాతి కాలంలో కుంతీ దేవి ఈ బాల్యలీల విని "కృష్ణా! నీ భయం చూసి భయానికే భయం వేసింది కదయ్యా!" అంటూ పొంగిపోయింది.


శ్రీకృష్ణుడి బాల్యం వింటుంటే ఆహా ఏమి భాగ్యం అనిపిస్తుంది.సాక్షాత్తూ పరమాత్ముడితో ఆడుకొన్న యశోదమ్మదే అదృష్టం కదా. ఇక ఒక సంఘటన చూద్దాం.

శ్రీ కృష్ణుడికి నడక కూడా రాని బాల్య దశలోని సంఘటన.

ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని ఊయలలో పడుకోబెట్టి వంటపని చేసుకొంటోంది.

అప్పుడు కృష్ణుడు పడుకొన్న గదిలోనికి దేవతలు వచ్చారు.

"స్వాగతం శంభో!, వచ్చి ప్రక్కన కూర్చో" అంటూ శివుడిని, "రండి! సృష్టికర్త గారూ! కూర్చోండి" అంటూ బ్రహ్మదేవుడిని, " రావయ్యా మేనల్లుడా!" అంటూ కుమారస్వామినీ, "ఓహో! దేవేంద్రుడు కూడా వచ్చేసారా!" అంటూ అందరినీ ఆహ్వానించసాగాడు.

యశోదమ్మకు కృష్ణుడు పలికిన ఈ మాటలన్నీ వినబడ్డాయి. ఆమె భయపడి కృష్ణుడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది. పిల్లవాడు కలవరిస్తే ఏమైనా కలవరించాలి కానీ దేవతలను ఆహ్వానించడమేమిటి అనుకుంటూ పిల్లవాడికి ఏమైనా మంత్రప్రయోగం జరిగిందేమోనని భయపడిపోయింది.

వెంటనే ఊసి ఒక రక్షను కృష్ణుడికి కట్టింది.

ఇది చూసి "ఎల్ల లోకాలకు రక్షకుడు ఐన శ్రీమహావిష్ణువుకే రక్ష కట్టగలిగిన యశోద అదృష్టం ఏమని చెప్పగలము" అంటూ అక్కడ అదృశ్యముగా ఉన్న దేవతలు ఆశ్చర్యపోయారు.


ఒకసారి ఒక గొల్లస్త్రీ తన ఇంట్లో వంటపనిలో నిమగ్నమై ఉంది. కాని అప్పుడప్పుడు తను తయారుచేసిన వెన్నను పెట్టిన కుండను వచ్చి చూస్తూ ఉంది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు,ఎలా వస్తాడో తన వెన్నను దొంగలిస్తాడో తెలియదు కాబట్టి. అలా మాటిమాటికీ వచ్చి చూస్తూఉంది. ఒక సారి వచ్చి చూసినప్పుడు అనుకొన్నదే జరుగుతోంది.

బాల కృష్ణుడు చక్కగా శబ్దం రాకుండా బాసింపట్టు వేసుక్కూర్చుని తన స్నేహితులను ముందు కూర్చోబెట్టుకొని ఆ కుండలోని వెన్నను కొద్దికొద్దిగా బయటకు తీసుకొని స్నేహితులకు పెడుతూ తనూ తింటున్నాడు.

ఆ గోపస్త్రీని చూసి మిగతా పిల్లలందరూ పారిపోయారు. కృష్ణుడి వెనుక వైపు ఆమె ఉండడం వలన ఆమెను తను చూడలేకపోయాడు.

ఆమె వెనుకనుండి కృష్ణుని భుజం పై చేయి వేసి కృష్ణుడు ఎవరో తెలిసినా ఇలా అడిగింది.
కృష్ణుడు ఏమాత్రం భయపడకుండా కూర్చున్నాడు.

గోపస్త్రీ : ఎవరు నువ్వు?
కృష్ణుడు : బలరాముని తమ్మున్ని
స్త్రీ : ఇక్కడ ఎందుకున్నావ్?
కృష్ణుడు : మా ఇల్లనుకొన్నాను. కాదా?
స్త్రీ : ఆ కుండను ఎందుకు తీసుకొన్నావ్?
కృష్ణుడు : మా దూడ ఒకటి తప్పిపోయింది. ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాను. ఐనా ఏంటమ్మా అప్పటినుండి నీ గోల? అన్నీ అడుగుతున్నావు.

ఇది విని ఆ స్త్రీ పాపం నిశ్చేష్టిత అయ్యి కృష్ణుడిపై చేయి తీసివేసింది.
కృష్ణుడు వెంటనే ఇందులో మా దూడ లేదు అంటూ తప్పించుకొన్నాడు.


దయచేసి ఈ బాల కృష్ణుడి బాల్యక్రీడను దృశ్యముగా ఊహించుకుంటూ చదవండి.

ఒకసారి కృష్ణుడు అన్నం తినకుండా మారాం చేస్తున్నాడు. యశోద అన్నం తినమని కృష్ణుడిని బ్రతిమాలుతోంది. కానికృష్ణుడు తినడం లేదు. ఇలా కాదనుకొని అమ్మ యశోద " నీకు ఒక మంచి కథ చెప్తాను. చెప్పనా?" అంది. "ఊ! చెప్పు" అన్నాడు. అమ్మ మొదలు పెట్టింది. "ఒక ఊళ్ళో ఒక రాజు", "ఊ!" అని మళ్ళీ నోరు బిగబట్టుకొన్నాడు. " ఈ ముద్ద తిను, కథ కొనసాగిస్తాను" అంది.

యశొద: ఆ రాజుకు కొడుకులు

కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే)

యశొద : ఒక ముద్ద తిను
కృష్ణుడు : కథ చెప్పు ( మళ్ళీ మూతి బిగించుకొన్నాడు)

యశొద : వారు వేటకు వెళ్ళారు
కృష్ణుడు : ఊ! ( మూతి బిగబట్టుకొనే) అమ్మ కథ చెపుతూనే ఉంది, కృష్ణుడు వింటూ ఊగొడుతూనే ఉన్నాడు. కాని నోరుబిగబట్టుకొని తినకుండా ఉన్నాడు.
అమ్మకు ఆ బుంగమూతి చూసి నవ్వాపుకోలేక ముద్దులతో ముంచెత్తింది.

అలాగే మరోసారి పాలు తాగకుండా మారాం చేస్తున్నాడు. అమ్మ బ్రతిమాలితే కృష్ణుడు అమాయకంగా " అమ్మా! పాలుత్రాగితే
వెంట్రుకలు పెరుగుతాయా?" అన్నాడు. పెరుగుతాయి,త్రాగు అంది అమ్మ.

త్రాగి
వెంట్రుకలును ఒకసారి ముట్టుకొని "అమ్మా! నా వెంట్రుకలు పెరగలేదు. నువ్వు పెరుగుతాయని చెప్పావు" అనిమూతి ముడుచుకొని కూర్చొన్నాడు. అమ్మ అనుకొంది " పిల్లవాడు, వెంటనే వెంట్రుకలు పెరుగుతాయిఅనుకొంటున్నాడు," అనుకొని బాల కృష్ణుడి బుంగమూతి చూసి ఆనందం పట్టలేక,నవ్వు ఆపుకోలేక దగ్గరకుతీసుకొంది.


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

భగవంతుని యందు పరమప్రేమయే భక్తి. ఈ బ్లాగులో భక్తుల కథలు, భగవంతుని లీలలు మొదలగునవి వ్రాయడం జరుగుతుంది. ఈ చిన్ని ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్ముతూ ప్రారంభించడం జరుగుతోంది.