నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


ఎన్నని చెప్పగలము బాలకృష్ణుడి లీలలు.


ఇప్పుడు మరో బాల్య లీల చూద్దాం.


ఒకరోజు ఎప్పటిలానే కృష్ణుడు అన్నం తినకుండా అమ్మ యశోద వద్ద మారాం చేస్తున్నాడు. యశోద అందరి అమ్మలలానే "నిన్ను బిచ్చగాడికి ఇచ్చేస్తాను" అంది. ఐనా కృష్ణుడు మారాం మానలేదు.


ఇంతలో నిజంగానే ఒక బిచ్చగాడు భిక్ష కోసం వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే కృష్ణుడు భయపడిపోతూ అమ్మ వద్దకు పరుగెత్తుకెళ్ళి అమ్మ కాళ్ళ మధ్య చీరలో తల పెట్టి " అమ్మా! నన్ను అతనికి ఇచ్చేయద్దు. నేను అన్నం తింటాను" అంటూ ఏడుస్తున్నాడు.అమ్మ యశోద "కిట్టయ్యా! నువ్వు నా బంగారానివి. నిన్ను ఎవరికి ఇస్తాను" అంటూ సముదాయించింది. ఇలా అంటూ ఆ బిచ్చగాడికి భిక్ష వేయడానికి ఇంట్లోకి వెళ్లబోయింది.

కాని కృష్ణుడు అడ్డుపడుతూ "అతనికి నన్ను ఇవ్వవద్దు" అంటూ అంటున్నాడు. యశోద కృష్ణుడిని ఎత్తుకొని ఆ బిచ్చగాడికి ఆహారం వేసింది. అంతసేపూ కృష్ణుడు అమ్మ భుజం పై తల పెట్టుకొని కళ్ళు మూసుకొనే ఉన్నాడు.తర్వాత అన్నం తిని, పాలు త్రాగి పడుకొన్నాడు. కాని రాత్రంతా ఆ బిచ్చగాడు వస్తాడేమోనని బయటకు చూస్తూనే ఉన్నాడు.


తరవాతి కాలంలో కుంతీ దేవి ఈ బాల్యలీల విని "కృష్ణా! నీ భయం చూసి భయానికే భయం వేసింది కదయ్యా!" అంటూ పొంగిపోయింది.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

శ్రీకరమైన భక్త్యంశాలతో భక్తి సామ్రాజ్యాన్నినెలకొల్పిన మీకు అభినందనలు.ఇక ప్రస్తుతాంశం పై నాఅభిప్రాయం విన్నవిస్తున్నాను.

క:-
భిక్షక రూపము దాలచ,
అక్షయమగు తనదు లీల నమ్మ గ్రహింపన్
చక్షులు మూసి గ్రహించెను
భిక్షాన్నము ఓగిరముగ. భీతి నటించెన్.

అభ్యాగతః స్వయం విష్ణుః కదండీ! అందుకని ఆ సన్నివేశం మనకు ఇంత అందంగా తెలియఁ జేయఁ బడింది అని నా భావన. నిజమేనంటారా?