నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


ఒకసారి ఒక గొల్లస్త్రీ తన ఇంట్లో వంటపనిలో నిమగ్నమై ఉంది. కాని అప్పుడప్పుడు తను తయారుచేసిన వెన్నను పెట్టిన కుండను వచ్చి చూస్తూ ఉంది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు,ఎలా వస్తాడో తన వెన్నను దొంగలిస్తాడో తెలియదు కాబట్టి. అలా మాటిమాటికీ వచ్చి చూస్తూఉంది. ఒక సారి వచ్చి చూసినప్పుడు అనుకొన్నదే జరుగుతోంది.

బాల కృష్ణుడు చక్కగా శబ్దం రాకుండా బాసింపట్టు వేసుక్కూర్చుని తన స్నేహితులను ముందు కూర్చోబెట్టుకొని ఆ కుండలోని వెన్నను కొద్దికొద్దిగా బయటకు తీసుకొని స్నేహితులకు పెడుతూ తనూ తింటున్నాడు.

ఆ గోపస్త్రీని చూసి మిగతా పిల్లలందరూ పారిపోయారు. కృష్ణుడి వెనుక వైపు ఆమె ఉండడం వలన ఆమెను తను చూడలేకపోయాడు.

ఆమె వెనుకనుండి కృష్ణుని భుజం పై చేయి వేసి కృష్ణుడు ఎవరో తెలిసినా ఇలా అడిగింది.
కృష్ణుడు ఏమాత్రం భయపడకుండా కూర్చున్నాడు.

గోపస్త్రీ : ఎవరు నువ్వు?
కృష్ణుడు : బలరాముని తమ్మున్ని
స్త్రీ : ఇక్కడ ఎందుకున్నావ్?
కృష్ణుడు : మా ఇల్లనుకొన్నాను. కాదా?
స్త్రీ : ఆ కుండను ఎందుకు తీసుకొన్నావ్?
కృష్ణుడు : మా దూడ ఒకటి తప్పిపోయింది. ఇందులో ఉందేమో అని వెతుకుతున్నాను. ఐనా ఏంటమ్మా అప్పటినుండి నీ గోల? అన్నీ అడుగుతున్నావు.

ఇది విని ఆ స్త్రీ పాపం నిశ్చేష్టిత అయ్యి కృష్ణుడిపై చేయి తీసివేసింది.
కృష్ణుడు వెంటనే ఇందులో మా దూడ లేదు అంటూ తప్పించుకొన్నాడు.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

నిజమును చెప్పెను కృష్ణుడు.
సుజనులు, సద్భక్తిపరులు, సూక్ష్మజ్ఞులు యా
నిజము నెఱుంగఁగఁ జేసెను,
భజియింపఁగ తనను మదుల భక్తిని కనుచున్.