నీ పాద కమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయ సేయగదే


శీర్షిక చూసి ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా. నిజమే ఈ మాటలన్నది శ్రీరాముడే. ఈ విషయం రామాయణం చదివిన చాలామందికి తెలుసు. అలానే చాలామందికి తెలియదు.

నాకు తెలుసు అన్న భావంతో చెప్పడం లేదు. రాముడికి లక్ష్మణుడిపై ఉన్న అభిమానం ఎంతో అలానే సంసారంలో సంబంధ,బాంధవ్యాలు ఎలా ఉండాలో రాముడు మనకు ఎలా చెబుతున్నాడో ,అందరికీ తెలియజేయాలనే భావంతో వ్రాస్తున్నాను.

ఇక విషయానికి వస్తున్నాను.

రాముడు అరణ్యవాసం చెస్తున్న తొలిదినాలవి. ఒకరోజు భరతుడు పరివారంతో కలిసి రాముడి వద్దకు వచ్చి దశరథుని మరణవార్త చెప్పాడు. వెంటనే రాముడు కన్నీరు కారుస్తూ సీతతో "సీతా! మీ మామయ్య మరణించాడు" అని లక్ష్మణునితో "లక్ష్మణా! మీ నాన్న మరణించాడు" అని అన్నాడు.

ఇక్కడే మనకొక అనుమానం వస్తుంది. రాముడేంటి అలా చెప్పాడు? దశరథుడు రాముడికి కూడా తండ్రే కదా! మన నాన్నగారు మరణించారని చెప్పవచ్చు కదా? అని.

ఇక్కడే రహస్యం ఉంది. రాముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమే కదా. కాబట్టి రాముడు చెప్పినదానిలో అర్థం, రాముడే ఇంకోచోట చెప్పాడు.

"ఇంట్లో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అన్న. కాని నేను లక్ష్మణుడిని అలా చూడలేదు. లక్ష్మణుడే తనకు అవసరం లేకున్నా నాతోపాటు వనవాసానికి వచ్చి నన్నే ఒక కొడుకును తండ్రి చూసుకుంటున్నట్లు చూసుకుంటూ నన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి లక్ష్మణుడు నాకు తండ్రి లాంటివాడే. కాని లక్ష్మణుడిని చూసుకొనే తండ్రి దశరథుడు మరణించాడు" అని రాముడు అన్నాడు.

ఇప్పుడు అర్థమైంది కదా రాముడు లక్ష్మణుడితో "మీ నాన్న మరణించాడు" అని ఎందుకన్నాడో.

ఇక సీతను ఉద్దేశించి అలా ఎందుకన్నాడో చూద్దాం.

ఒక మామ తన కోడల్ని ఎలా చూసుకోవాలో దశరథుడు అంతకన్నా ఎక్కువగా ఒక కూతురిగా సీతను చూసుకొన్నాడు.
దీనికి ఉదాహరణగా మనం క్రింది సంఘటనను చెప్పవచ్చు.

రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు వనవాసనియమాలు రాముడికి మాత్రమే వర్తిస్తాయని, సీతకు వర్తించవని దశరథుడు అనుకొన్నాడు. అందుకనుగుణంగా వనవాససమయంలో ఒక రోజు కట్టిన చీర మరో రోజు కట్టనవసరం లేకుండా పదునాలుగేళ్ళకు సరిపడా పట్టుచీరలు , నగలు పంపడానికి తెప్పించి పంపబోగా లక్ష్మణుడు వాటిని తీసుకుపోవడానికి సిద్దపడ్డాడు.

ఇప్పుడు చెప్పండి తండ్రి మాత్రమే తన కూతురు మెట్టినింటికి వెళ్తున్నప్పుడు సారె పంపుతాడు కదా. అలాంటిది తన కొడుకుకు లేకున్నా తన కోడలి కోసం పంప ప్రయత్నించిన దశరథుడు ,సీతను కన్నతండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నట్లే కదా. ఇంతటి సంబంధబాంధవ్యాలు ఉండబట్టే "సీతా! మీ మామయ్య చనిపోయాడు" అని రాముడన్నాడు.

3 comments:

శిశిర said...

మంచి విషయాలు చెప్తున్నారు. అభినందనలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

బావుంది సార్. ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఒక చిన్న సందేహం, ఇది వాల్మీకి రామాయణంలో ఉందా? లేక ఆద్యాత్మిక రామాయణంలో ఉందా?

సురేష్ బాబు said...

వాల్మీకి రామాయణములోనేనండీ